బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానీ మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలపై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా అయిన ఎక్స్ లో పోస్ట్ చేశారు. నిజాలు ఎప్పుడైనా బయటపడుతాయి. వెంటనే కాకపోయినా చివరికీ అయినా బయటపడక తప్పదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అర్థం లేని దుష్ప్రచారాలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ వారు తప్పించుకోలేరని తెలిపారు.
ప్రజలు అధికారం కట్టబెట్టింది వారి జీవితాలను బజార్ కి లాగడానికి కాదన్నారు. అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశమని.. అంతేకానీ పుకార్లు పుట్టించడానికి..ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసేందుకు కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయాల పేరుతో విషం చిమ్మి తప్పించుకోగలమని భావించే ప్రతి ఒక్కరికి ఇది ఒక గుణపాఠంగా ఉపయోగపడుతుందని తాను ఆశిస్తున్నానన్నారు. తాను చేస్తున్ననది సుదీర్ఘ యుద్ధం అని.. ప్రస్తుతం సగంలో దూరంలోనే ఉన్నానని, గెలిచే వరకు పోరాడుతూనే ఉంటానని కేటీఆర్ ట్వీట్ చేశారు.