ఈ ఏడాది అకాల వర్షాలతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట కోతకు వచ్చినప్పటి నుంచి.. కోతలు జరిగే సమయంలో.. కుప్పలు పడిన సమయంలో.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చినప్పుడు.. ఇలా ప్రతి దశలో వరణుడు కర్షకులను భయపెట్టాడు. ఈ క్రమంలో అకాల వర్షాల వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర సర్కార్ ముందుకొచ్చింది.
ఇందులో భాగంగానే.. గత మార్చి 16 నుంచి 21 వరకు తెలంగాణలోని 26 జిల్లాల్లో అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభత్వం రూ.151.46 కోట్ల పరిహారం విడుదల చేసింది. ఈ నిధులను జిల్లాల వారీగా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులకు పంపించి, నేరుగా రైతుల ఖాతాల్లో వేయాలని ఆదేశించింది. గతంలో పరిహారంగా చెక్కులను అందజేసేవారు. ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నేరుగా నగదు బదిలీకి ఆదేశించారు.
కేసీఆర్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో పంట నష్టాలను స్వయంగా పరిశీలించి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వ్యవసాయశాఖ సర్వేలు నిర్వహించి 1,51,645 ఎకరాల నష్టాన్ని నమోదు చేసింది. దీనికి అనుగుణంగా 1,30,988 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేయాలని ఆదేశించింది.