కాంగ్రెస్ అత్యున్నత కమిటీ-CWC సమావేశాలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. ఈ సమావేశాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రెండు రోజులుగా ఏర్పాట్లకు సంబంధించి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో నిర్వహించబోయే CWC సమావేశాలు ప్రయోజనం చేకూరుస్తాయని పీసీసీ అంచనా వేస్తోంది. ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజులుపాటు ఈ సమావేశాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్న పీసీసీ… ఏర్పాట్లు చేయడంలో ఇప్పటి నుంచే నిమగ్నమైంది.
ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఠాక్రేలతోపాటు సీనియర్ నాయకులతో ఆయన సమావేశమై సమీక్ష నిర్వహిస్తారు. సీడబ్ల్యుసీ సమావేశానికి వచ్చే వాళ్లు ఉండేందుకు వసతి, భోజనాలు తదితరాలు ఎక్కడైతే బాగుంటుందన్న దానిపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. సమావేశాలకు వచ్చే నాయకులు అంతా అగ్రనేతలు కావడంతో ఎక్కడ నిర్వహిస్తే భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్న దానిపై కూడా సమీక్ష చేయనున్నారు. రాత్రికి హైదరాబాద్‌లోనే ఉండనున్న కేసీ వేణుగోపాల్.. మరుసటి రోజు ఉదయాన్నే పయనమవనున్నారు.