కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ-CWC సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 16, 17వ తేదీల్లో సమావేశాలు ఉంటాయని… పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సీడబ్ల్యూసీ సమావేశాలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ హైకమాండ్ భావించినట్లు తెలుస్తోంది. అందువల్లే హైదరాబాద్‌లో సమావేశాలకు అధిష్ఠానం ఆమోదించినట్లు సమాచారం.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం.. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాంధీ సహా సీడబ్ల్యూ సభ్యులంతా హైదరాబాద్‌కు తరలి రానున్నారు. రాష్ట్ర ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాల రూపకల్పన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఐతే.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం ప్రకటించడంతో.. సీడబ్ల్యూసీ సమావేశాల తేదీలు మారే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఏది ఏమైనా రాష్ట్ర కాంగ్రెస్కు ఈ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించడం కాస్త కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. జాతీయ నేతలు హైదరాబాద్ వచ్చిన తర్వాత పలు కార్యక్రమాలు రూపొందించాలనే యోచనలో రాష్ట్ర నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.