తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా సర్కార్ పెంచిన డీఏ బకాయిలను ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి – జీపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 2022 జనవరి 1 నుంచి 2023 మే 31 వరకు చెల్లించాల్సిన డీఏ బకాయిల విధివిధానాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపిన ప్రభుత్వం… 2023 అక్టోబర్ 31 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు మాత్రం పదవీ విరమణ సమయంలో బకాయిలు చెల్లించనున్నట్లు పేర్కొంది.
సీపీఎస్ వర్తించే ఉద్యోగులకు బకాయిల్లో పది శాతం ప్రాన్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు. మిగిలిన 90 శాతం జులై నుంచి 17 విడతల్లో చెల్లిస్తారు. జీపీఎఫ్‌కు అర్హులుకాని పార్ట్‌టైం ఉద్యోగులు, వీఆర్ఏలు, ఫుల్‌టైమ్ కంటింజెంట్ ఉద్యోగులకు జులైలో డీఏ బకాయిలు చెల్లిస్తారు. పెన్షనర్లకు జులై నుంచి 17 విడతల్లో డీఏ బకాయిలు చెల్లిస్తారు.