రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో తొలి జాబితా వెలువడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినా… మరింత జాప్యం కావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఎప్పుడైనా షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండగా… అంతకు ముందే పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెబుతూ వచ్చినా, సాధ్యమయ్యే పరిస్థితి లేదు.
40 కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీలో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు మరో 30 నియోజకవర్గాలలో టికెట్ల కోసం గట్టి పోటీ ఉండడంతో మరొకసారి సర్వేలు నిర్వహించాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు గత నెల చివరి వారం నుంచి సర్వేలు కొనసాగుతున్నాయి. ఈ నెల 7న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉండే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేసినా… వాయిదా పడినట్లు తెలుస్తోంది.
రెండో వారంలో ఈ కమిటీ సమావేశమై తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిటీ తేదీ ఖరారు అయిన వెంటనే ఆ ముందు రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశమై మొదటి జాబితాకు సంబంధించి దాదాపు 70 పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.