తెలంగాణకు తొలకరి మరింత ఆలస్యం కానుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులుగా ముందుకు కదలడం లేదని తెలిపారు. ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ సరిహద్దును తాకిన రుతుపవనాలు… ఇప్పటికే కర్ణాటకలో వ్యాపించాల్సి ఉన్నా ఏపీలోనే స్తంభించిపోయాయని వెల్లడించారు. ఈ క్రమంలో 19వ తేదీ నాటికిగానీ అవి తెలంగాణకు ఎప్పుడు వచ్చేది అంచనా వేయలేమని వాతావరణ శాఖ పేర్కొంది.
సాధారణంగా రుతుపవనాలు జూన్ 10న తెలంగాణను తాకాలి. ఈ ఏడాది వాటి రాక ఆలస్యమవడంతో 15వ తేదీలోపు వస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఈ అంచనా కూడా తప్పిపోయింది. అదే సమయంలో రాష్ట్రంలో వడగాలుల తీవ్రత కొనసాగుతోంది. జూన్ రెండోవారం ముగుస్తున్నా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి.
మరో మూడ్రోజులు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఖమ్మం, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలపై వీటి ప్రభావం ఉంటుందని తెలిపింది.