జీహెచ్‌ఎంసీలో వార్డుల పాలనకు రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని కాచిగూడలో వార్డు కార్యాలయం ప్రారంభించనున్నారు. ఇతర డివిజన్లలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వార్డు కార్యాలయాలు ప్రారంభించనున్నారు. పౌర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో వార్డు కార్యాలయాలు నిర్మించినట్లు గతంలోనే ప్రభుత్వం తెలిపింది. 150 డివిజన్లలో వార్డు కార్యాలయాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పూర్తయిన చోట కార్యాలయాలను ఇవాళ ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఒక్కో వార్డులో 10 మంది అధికారులు అందుబాటులో ఉండనున్నారు.
ఇక్కడ రోడ్లు, డ్రైనేజీల వంటి వాటి నిర్వహణకు ఇంజినీరింగ్ సిబ్బంది , భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది , దోమల సమస్యకు ఎంటమాలజీ విభాగం అధికారులు అందుబాటులో ఉంటారు. మహిళా సంఘాలకు ఉపయుక్తంగా ఉండేలా వార్డు కమ్యూనిటీ ఆఫీసర్, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయానికి వార్డు శానిటరీ జవాన్, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్‌వైజర్, తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు జలమండలి నుంచి వార్డు అసిస్టెంట్, విద్యుత్ శాఖ తరఫున వార్డు లైన్‌మెన్, ఓ కంప్యూటర్ ఆపరేటర్…. ఈ కార్యాలయాల్లో ఉంటారు.