కాళేశ్వరం ఘటన.. రహస్య రికార్డులు, ఆధారాలపై డీజీ స్పెషల్ ఫోకస్

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంచలనం రేకెత్తించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలో పగుళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రతన్‌ బృందం కాళేశ్వరం ప్రాజెక్టును రెండో రోజు పరిశీలించింది. లక్ష్మీ (కన్నెపల్లి) పంపుహౌస్‌కు వెళ్లిన ఈ బృందం.. కింది భాగంలోని మోటార్ల ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. రెండు టీఎంసీలకు సంబంధించి 11 మోటార్లు, అదనపు టీఎంసీకి సంబంధించి 6 మోటార్లను అమర్చినట్లు ఈఈ తిరుపతిరావు, డీఈ సూర్యప్రకాశ్‌ రాజీవ్‌ రతన్‌కు వివరించారు.

గతేడాది వరద పంపుహౌస్‌లోకి ఏ మేరకు చేరుకుందో తెలియజేయగా.. తిరిగి వరద రాకుండా ఏం చర్యలు తీసుకున్నారని డీజీ ప్రశ్నించారు. పటిష్ఠమైన కాంక్రీట్‌ గోడలను నిర్మించామని ఇంజినీర్లు డీజీకి చెప్పినట్లు సమాచారం. అనంతరం సమీపంలోని కంట్రోల్‌ రూములను పరిశీలించి బృందానికి ఫోర్‌బే వద్ద గతేడాది వరద పంపుహౌస్‌లోకి ప్రవేశించిన మార్గాన్ని అక్కడి సిబ్బంది వివరించారు. లక్ష్మీ పంపుహౌస్‌డెలివరీ ఛానల్‌ను పరిశీలించిన బృందం గ్రావిటీ కాలువ ద్వారా నేరుగా అన్నారం సరస్వతి బ్యారేజీ వద్దకు వెళ్లారు. మేడిగడ్డలో డీజీ రాజీవ్‌ రతన్‌ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను స్వాధీనం చేసుకున్నామని.. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news