భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు కెసిఆర్ దగ్గర మోడీ కమిషన్ తీసుకున్నారా?: వినోద్ కుమార్

తక్కువ ధరకు కరెంటు మార్కెట్లో అందుబాటులో ఉంటే.. ఎక్కువ ధరకు తెలంగాణ సర్కారు కొన్నదని బండి సంజయ్ చేసే ఆరోపణలు పచ్చి అబద్ధం అని అన్నారు బోయినపల్లి వినోద్ కుమార్. తుప్పు పట్టిన సామాగ్రిని భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు వాడారని బండి సంజయ్ అని ఆ ఆరోపణలు ఆయన మీదే వేసుకున్నారని అన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టును ఎవరు నిర్మిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఎల్ నిర్మిస్తోంది. బీహెచ్ఈఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అని మరచి బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ కు భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు అవసరమైన మిషనరీ సప్లై ఇచ్చామని, ప్రైవేట్ కంపెనీలు ఉండగా.. ప్రభుత్వ రంగ సంస్థ ఎందుకు అని కేంద్రమంత్రి పీయుష్ గోయల్ అప్పట్లో అన్నారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుంభకోణం ఎలా జరుగుతుంది అని, అలాగైతే కెసిఆర్ దగ్గర మోడీ కమిషన్ తీసుకున్నారా? అని ఎద్దేవా చేశారు బోయినపల్లి వినోద్ కుమార్.