నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండల కేంద్రంలో ఉపాధిహామీ పనుల్లో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంత మంది పేదల పేర్లు మస్టర్ లో రావడం లేదు. నేరేడుగొమ్ము గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలకు ఎప్పుడూ మస్టర్ వస్తుందో.. ఎప్పుడూ రావడం లేదో అర్థం కాని పరిస్థితి. ఒక వారం సోమవారం నుంచి శనివారం వరకు మస్టర్ వస్తే.. మరో వారం గురువారం నుంచి బుధవారం వరకు వస్తుంది.
అయితే సోమవారం నుంచి శనివారం ఒక మస్టర్ వచ్చినప్పటికీ ఉపాధి హామీ కూలీలు పని చేసేందుకు వెళ్లగా రైతు అక్కడ పని చేయవద్దు అని చెప్పడంతో వారం రోజుల పాటు కూలీలు ఖాలీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక వారం రోజుల పాటు ఖాలీగా ఉండి.. గురువారం నుంచి బుధవారం వరకు మరో మస్టర్ జారీ చేశారు. ఆ తరువాత మళ్లీ మస్టర్ లో కొంత మంది పేర్లు మాత్రమే నమోదు చేసి దాదాపు 30 మంది పేర్లు నమోదు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారు. తమ తోటి కూలీలు ఉపాధి హామీ పనికి వెళ్తుండగా.. తమకు పని లేకుండా అయిందని బాధపడుతున్నారు. వారి ఇబ్బందులను గుర్తించి ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ఉపాధి హమి కూలీలు.