కెసిఆర్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బుధవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటి అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ కి దమ్ముంటే వచ్చే ఎన్నికలలో బీసీని సీఎం చేస్తానని ప్రకటించాలని సవాల్ విసిరారు. ఒక కాంగ్రెస్ పార్టీతోనే అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని అన్నారు కోమటిరెడ్డి. అధికార పార్టీ నేతల పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తే దాన్ని బీసీ కులాలకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. బీఆర్ఎస్ పేదల భూములను లాక్కుంటూ తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతుందని ధ్వజమెత్తారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను నియంత పాలన నుండి విముక్తి చేయడం కోసం కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.