అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి, సంక్షేమంతో పాటు పెండింగ్ పనుల పురోగతి వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ఉన్న సమస్యలు, పురోగతి, అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో ఏడు ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని డబుల్ బెడ్‌రూమ్‌లు కేటాయిస్తామన్నారు. జిల్లా అధివృద్ధిలో ప్రభుత్వం, అధికారులు కలిసి పని చేయాల్సి ఉందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో ఫిష్ మార్కెట్లు కొత్తగా నిర్మించే ఆలోచన ఉందని వివరించారు. అవసరం అయితే ప్రతీ మండలంలో ఒక ఫిష్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు పెరిగిన డైట్ ఛార్జీలు అమలు చేస్తామన్నారు. జీవో 58, 59 జీవోలకు సంబంధించిన అంశాలను కూడా సమీక్షిస్తామని మంత్రి తెలిపారు.