తెలంగాణ విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా సెలవులపై క్లారిటీ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ పండుగకు 14 రోజులు సెలవులు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది. పాఠశాల విద్యాశాఖ నిర్ణయంతో విద్యార్థులు సంబురాల్లో మునిగిపోయారు.
మొదట 14 రోజుల సెలవులు ప్రకటించిన విద్యాశాఖకు.. సెలవులు తగ్గించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రతిపాదించింది. కానీ విద్యాశాఖ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని.. ఈనెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు యథాతథంగా పాఠశాలలకు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. అక్టోబర్ 10న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
భారీ వర్షాల కారణంగా జులైలో పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున.. నష్టపోయిన బోధన పనిదినాల భర్తీకి దసరా సెలవులు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖకు ఎస్‌సీఈఆర్‌టీ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ తొలుత ప్రకటించిన విధంగానే దసరా సెలవులు కొనసాగుతాయని వెల్లడించింది.