మహారాష్ట్రకు తరలిపోయిన ఏనుగు.. ఊపిరిపీల్చుకున్న కుమురంభీం ప్రజలు

-

ఛత్తీస్​ఘడ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి దారితప్పి వచ్చిన ఏనుగు కుమురం భీం జిల్లాలో విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా పెంచికల్‌పేట్‌, చింతనమానేపల్లికి చెందిన ఇద్దరు రైతులను హతమార్చిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు హడలెత్తించిన ఏనుగు, శుక్రవారం సాయంత్రం ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్లిపోయినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

పెంచికల్‌పేట్‌ మండలం మొర్లిగూడ, జిల్లెడగుట్ట అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం వరకు సేదతీరిన ఏనుగు, సాయంత్రం 6 గంటల తర్వాత జిల్లెడ మార్గం గుండా ప్రాణహిత దాటి మహారాష్ట్ర ప్రాంతంలోని చిన్నవట్ర గ్రామం వైపు వెళ్లినట్లు డ్రోన్‌ కెమెరాల ద్వారా గుర్తించినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. గజరాజు జిల్లా నుంచి తరలివెళ్లడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

 అటవీ పోలీసు శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించారు. బెజ్జూరు, పెంచికలపేట్, దహెగాం, చింతలమానేపల్లి మండలాల్లోని ప్రజలు ఏనుగు భయం కారణంగా ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. సలగుపల్లి, పెంచికల్​పేట, కడంబా మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు కొనసాగించేందుకు భయాందోళనలకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news