తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఓవైపు పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తోంటే.. మరోవైపు ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల కోసం కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను(ఈవీఎంలను) తనిఖీ చేయనున్నారు. ఇవాళ, రేపు ఈ ప్రక్రియ జరపాలని రాష్ట్ర అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈవీఎంల తనిఖీ గురించి అన్ని రాజకీయ పార్టీలకు ముందస్తు సమాచారం అందించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల పరిశీలకులూ ఆ సమయంలో అందుబాటులో ఉంటారని పేర్కొంది. ఈవీఎంలలో అందరూ సంతృప్తి వ్యక్తం చేసిన వాటికి సీలు వేసి పోలింగ్ ప్రక్రియలో వినియోగించాలని తెలిపింది.
ఈ నెల 30వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. ఇందుకోసం ఈసీ రాష్ట్రానికి 72,931 బ్యాలెట్ యూనిట్లు, 57,592 కంట్రోల్ యూనిట్లను రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ఎన్నికల్లో 59,799 బ్యాలెట్ యూనిట్లను వినియోగించాలని నిర్ణయించిన అధికారులు.. మిగిలిన వాటిని రిజర్వులో ఉంచనున్నారు.