లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నలుగురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఇందులో రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య ఉన్నారు.
అయితే తాజాగా జీహెచ్‌ఎంసీ మేయర్ జి.విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎంతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఆమెకు కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే వీరు పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇందులో కడియం కావ్యకు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది.