గత రెండ్రోజులుగా తెలంగాణలో వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో మంగళవారం రోజున గాలివాన బీభత్సం సృష్టించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గుర్‌లో చెట్టుకొమ్మ విరిగి పడడంతో పదోతరగతి విద్యార్థి మృతి చెందాడు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం జాజి తండాలో మాన్‌సింగ్, మంజుల దంపతుల కూతురు సంగీత (6) సోమవారం రాత్రి ఇంటి ఎదుట ఆడుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన గాలి దుమారానికి ఎగిరిపోయి పక్కనే ఉన్న ఇంటి గోడకు బలంగా గుద్దుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్ చింతల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.
మరోవైపు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గుర్‌కు చెందిన వెంకటేశ్ (15) మంగళవారం రోజున మండల పరిధిలోని అహ్మదీపూర్ జడ్పీ హైస్కూల్‌లో పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు. సాయంత్రం పొలానికి వెళ్లి నుంచి పశువులను తోలుకుని ఇంటికి వస్తున్న సమయంలో వర్షం రావడంతో చెట్టు కింద నిల్చున్నాడు. ఈదురు గాలులకు ఆ చెట్టు కొమ్మ విరిగి బాలుడి తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.