తెలంగాణ ప్రభుత్వ సహకారంతో, ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్‌టిట్యూట్-ICI ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా గ్లోబల్ రైస్ సమ్మిట్- 2024 ఇవాళ్టి నుంచి జరగనుంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాఛనంగా ప్రారంభించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా బియ్యానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వరి సాగులో పురోగతి, హైబ్రిడ్ రైస్, అంతర్జాతీయ మార్కెట్ దృక్పథంపై విస్తృతంగా చర్చించనున్నారు.
అంతర్జాతీయ కమోడిటీ సంస్థ 22ఏళ్లుగా ఒక్కో దేశంలో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తోంది. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, భాతీయ వరి పరిశోధన సంస్థ నాలెడ్జ్ ఈ సదస్సుకు భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నాయి. అంతర్జాతీయంగా 30 దేశాల ప్రతినిధులు, భారత్‌లోని వివిధ రాష్ట్రాల రైస్ మిల్లర్లు, ఎగుమతిదారులు, శాస్త్రవేత్తలు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ప్రపంచ విపణిలో భారత్‌కు ఉన్న సవాళ్ల పరిష్కారంపై ఈ సమ్మిట్లో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సదస్సుకు 150 మంది ప్రతినిధులతోపాటు భారతదేశం నుంచి సుమారు 400 మంది హాజరు కానున్నారు. సదస్సులో దేశీయ బియ్యం ఎగుమతిదారులు, ఇతర దేశాల దిగుమతిదారులతో కలిసి నేరుగా సంప్రదింపులు జరిపేందుకు అవకాశం ఉంది.