తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇవాళ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు సిద్దం అయింది. వరి క్వింటాల్ కి రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు కీలక ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ పంట నుంచే ఇది అమలులోకి వస్తుందని తెలిపారు.
ముఖ్యంగా సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించిందని పేర్కొన్నారు. అవి పండించిన రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. వ్యవసాయానికి రూ.72, 659 కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.737 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1980 కోట్లను కేటాయించారు. అలాగే నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లు కేటాయించారు.