తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రకతి భవన్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదవే విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది.
వచ్చే ఆకాడమిక్ ఇయర్ నుంచే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య అందించేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒక మంత్రి వర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సబ్ కమిటీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత అధ్యక్షతన ఉంటుంది.
ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, పువ్వాడ అజయ్ ఉండనున్నారు. ఈ కమిటీ ఇంగ్లీష్ మీడియంతో పాటు ఫీజుల నియంత్రణ కోసం అధ్యయనం చేయనుంది. కాగ ప్రస్తుతం తెలంగాణ లోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పాక్షికంగా అమలు అవుతుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో పకడ్బందీగా ఆంగ్ల మాద్యమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.