ఏపీలో పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు విద్యాశాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో పదోతరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 23న విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 81.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అందులో అమ్మాయిలు 84.09, అబ్బాయిలు 78.31 ఉత్తీర్ణత సాధించారు. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశపడకుండా ప్రభుత్వం వారికి మరో అవకాశం కల్పించింది. ఈ తరుణంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగనున్నాయి. అలాగే ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్నయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. మే 18 వరకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది విద్యాశాఖ.