యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి భక్తులకు శుభవార్త చెప్పారు ఆలయ ట్రస్ట్ అధికారులు. ఆలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి 5.30 గంటల వరకు ఉచితంగా స్థానికులకు దర్శన సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక చిరునామా, ఐడీ ప్రూఫ్, సాంప్రదాయ దుస్తులతో వచ్చే స్థానికులకు మాత్రమే గర్భాలయ దర్శనం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఆలయ ఈవో భాస్కర్ రావు సోమవారం అధికారిక ప్రకటన చేశారు.
ఈవో భాస్కర్ నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యాదాద్రిలో నిత్య అన్నదాన సదుపాయాన్ని ఆదివారం నుంచి 1000 మంది భక్తులకు కల్పిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. ఇప్పటి వరకు 600 మంది భక్తులకు నిత్యాన్న ప్రసాదం కల్పిస్తున్నామని.. ఇక నుంచి మరో 400 మందికి అన్నప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. ఇక ఆదివారం ఏకాదశిని పురస్కరించుకుని 4,600 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. తలనీలాల ద్వారా రూ.2,30,000 ఆదాయం సమకూరిందని వెల్లడించారు.