ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. యువకుల బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణలో ప్రజాకాంక్షలు నెరవేరేలా ఈ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. ఈ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత పాటిస్తుందని చెప్పారు. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశామని తన ప్రసంగంలో గవర్నర్ పేర్కొన్నారు.
“రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య వర్సిటీలు ఏర్పాటు చేస్తాం. విద్యతో పాటు ఉద్యోగం సాధించేలా యువతలో నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, వికలాంగ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు అందిస్తాం. ప్రతి రంగానికి ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, అనుకూల వ్యవస్థలు ఏర్పాటు చేస్తాం. 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. జనావాసానికి దూరంగా వెయ్యి నుంచి 3 వేల ఎకరాల విస్తీర్ణంతో ఫార్మా విలేజ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. సమగ్ర డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. హైదరాబాద్‌ను దేశంలోనే కృత్రిమ మేథస్సు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తాం.” అని గవర్నర్ పేర్కొన్నారు.