తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు చేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు పరిచింది. మిగతా హామీ అమలుపై ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే గత సర్కార్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలకు ముగింపు పలుకుతోంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది.
సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసేలా కేసీఆర్ సర్కార్ గృహలక్ష్మి పథకాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు కొన్ని నెలల ముందు దరఖాస్తులు స్వీకరించగా కొంతమందికి మంజూరయ్యాయి. అయితే సొంత జాగా ఉన్న వారికి ఇందిరమ్మ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఆరు గ్యారంటీల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కొత్త పథకం అమలు కోసం కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాత గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్ లైన్ పోర్టల్లో కలెక్టర్లు జారీ చేసిన మంజూరు పత్రాలను రద్దు చేస్తున్నట్లుగా జీవోలో పేర్కొన్నారు.