హైదరాబాద్‌లో కాల్పుల కలకలం… ఒకరు మృతి

హైదరాబాద్‌లో గురువారం కాల్పుల ఘటన కలకలం రేపింది. కూక‌ట్‌ప‌ల్లిలోని పటేల్‌కుంట పార్కు సమీపంలో గల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద ఏటీఎం సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జరిగిన విషయానికి వస్తే…హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సిబ్బంది వెళ్ళారు. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.

ఇద్దరు సిబ్బందితో పాటు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుపై దుండగులు కాల్పులు జరిపారు. మొత్తం మూడు రౌండ్ల కాల్పులు జరిపి రూ.5లక్షల డబ్బును దోచుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ ఘటనలో ఏటీఎం సిబ్బంది అలీ బేగ్‌, శ్రీనివాస్‌ తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో అలీ బేగ్‌ మృతి చెందగా .. శ్రీనివాస్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దుండగులు అల్వీన్‌ కాలనీవైపు నుంచి పల్సర్‌ వాహనంపై వచ్చి.. కాల్పుల అనంతరం దుండగులు భాగ్యనగర్‌ వైపు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.

ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిలో రెండు బుల్లెట్లు, బుల్లెట్‌ లాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలానే పలు ఆధారాలు సేకరించారు. ఇక సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో జన సంచారం తక్కువ ఉండడం మళ్ళీ మధ్యాహ్నం కావడంతో దుండగులు ప‌క్కా ప్రణాళిక ప్రకారం చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.