పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో రకరకాల ఊహాగానాలు రావడం సాధారణమని పేర్కొన్నారు. ఏ పార్టీకి సంబంధం లేని రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న తనకు పార్టీ మారాలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. వివిధ కారణాల రీత్యా అమిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నుంచి వెనక్కి తగ్గారని వెల్లడించారు. స్థానిక పరిస్థితులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల తీరుతో నిర్ణయం మార్చుకున్నారని తెలిపారు. కాంగ్రెస్లో అమిత్ రెడ్డి చేరికకు గతంలో ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమేనని చెప్పారు. కానీ పార్టీలో చేరికపై ప్రస్తుతం ఎలాంటి చర్చ లేదని క్లారిటీ ఇచ్చారు.
“సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మా సమీప బంధువు. వేం నరేందర్ రెడ్డితో అమిత్ భేటీ పెద్దగా ప్రాధాన్యం లేనిది. ఆ భేటీలో రాజకీయ అంశాలపై చర్చ జరగలేదు. కాంగ్రెస్ 100 రోజుల పాలన విషయంలో ప్రజల్లో సానుకూలత ఉంది. సీఎం రేవంత్ రెడ్డి బంధువైనా… అసెంబ్లీ సమావేశాలు మినహా మిగతా విషయాలు చర్చ చేయలేదు. జమిలి ఎన్నికల విధానంపై లోతుగా అధ్యయనం చేయాలి.” అని గుత్తా పేర్కొన్నారు.