తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు తరచూ ఓ అడ్డంకి వస్తోంది. అంతా సర్దుకుంటోంది అనుకునేలోగా మరో సమస్య ఎదురవుతోంది. తాజాగా రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) తెలుగు, హిందీ, ఉర్దూ ఉపాధ్యాయులతోపాటు ఫిజికల్ డైరెక్టర్(పీడీ)ల బదిలీలకు బ్రేక్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉపాధ్యాయుల బదిలీ జరగాల్సి ఉండగా అందులో సగం వరకు నిలిచిపోయాయి.
భాషా పండితులు, పీడీ పోస్టుల ఉన్నతీకరణ, పదోన్నతులను ఎస్జీటీలను కలుపుకొని ఉమ్మడి సీనియారిటీ ఆధారంగా చేపట్టాలని ఇటీవల హైకోర్టు తుది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బదిలీలు జరిగితే మారుమూల గ్రామాల్లో టీచర్లు ఉండరని కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. అధికారులు ఈ బదిలీలు నిలిపివేయాలని, మిగిలిన ఎస్‌ఏలకు సోమవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని డీఈఓలను పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు ఆదేశించారు. పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిలీవ్ చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరున్నచోట సీనియర్‌ను బదిలీపై పంపి జూనియర్‌ను అక్కడే కొనసాగించాలని సూచించారు.