తెలంగాణలో గత రెండ్రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు జిల్లాల్లో వడగండ్లు కురవడంతో చేతికొచ్చిన పంట నీటిపాలైపోయింది. ఇక మామిడి, నిమ్మ పంట పంటలు పూత రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
‘గత మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాల కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు. కాంగ్రెస్ సర్కారుకి కేవలం రాజకీయాలే తప్ప రైతు వేదన పట్టడం లేదు. గతంలో అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే అప్పటి సీఎం కేసీఆర్ తక్షణం రైతులను ఆదుకున్నారు. వడగళ్ల వానతో వరి, మొక్కజొన్నతోపాటు బొప్పాయి, మామిడి సహా ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం కలిగింది. జిల్లాల వారీగా నష్టాన్ని అంచనా వేసి… తక్షణం ఎకరాకు పదివేల పరిహారం ప్రకటించాలి.’ అని బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది.
వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు… pic.twitter.com/KQAMv1kKz5
— Harish Rao Thanneeru (@BRSHarish) March 19, 2024