తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయగా దానిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాలు ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నవేనని స్పష్టం చేశారు. మరోవైపు శాసనసభా వేదికగా మేడిగడ్డ బ్యారేజీ ఘటన చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా మేడిగడ్డ ఘటనపై హరీశ్ రావు కూడా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామంటున్నారని అన్నారు. వారే కాదూ తాము కూడా మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఈ సందర్భంగా హరీశ్ రావు అన్నారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరాన్ని రూ.80వేల కోట్లతో కట్టామనడం అబద్దమని అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణమే రూ.97,448 కోట్లు మంజూరైందని తెలిపారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని వెల్లడించారు.