బీఆర్ఎస్ పార్టీ నినాదాల పార్టీ కాదని.. నిజాలు చేసి చూపించే పార్టీ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్‌ను విమర్శించేవాళ్లు రాష్ట్ర పరిస్థితి చూసి మాట్లాడాలని హితవు పలికారు. అమిత్ షా, మల్లికార్జున్ ఖర్గేలు తెలంగాణ అభివృద్ధిని చూసి పోవడానికి అప్పుడప్పుడు వచ్చే టూరిస్టులు అని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ ఆశయాలను నిజం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని హరీశ్ రావు కొనియాడారు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శించేవాళ్లు ముందుగా వాళ్ల రాష్ట్రాల్లో పరిస్థితి చూశాక మాట్లాడాలన్నారు.
టూరిస్టులైన అమిత్ షా, ఖర్గేలు.. లోకల్ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమే తప్ప రాష్ట్రంపై వారికి అవగాహన లేదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు మూడోసారి కూడా బీఆర్ఎస్ కావాలని డిక్లేర్ చేశారని చెప్పారు. దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ చేస్తున్న విధానాలకు ఆకర్షితులై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత యాతాకుల భాస్కర్ తమ పార్టీలో చేరారని హరీశ్ రావు తెలిపారు. ఆయనకు బీఆర్ఎస్లో సముచిత స్థానం కల్పిస్తామని వెల్లడించారు. యాతాకుల భాస్కర్‌కు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి హరీశ్ రావు ఆహ్వానించారు.