హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ఈ మేరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. అసిస్టెంట్ ప్రొఫెసర్లలో రిజర్వేషన్లు అమలుచేశామని తెలిపారు. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయని.. వాటిని కూడా భర్తీ చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
‘నిమ్స్ ఆసుపత్రికి వచ్చే వారు పేదవారు. పేద రోగులకు ప్రేమను, మమకారాన్ని పంచండి. నిమ్స్‌పై ప్రజలకు అధిక విశ్వాసం ఉంది. నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కువగా అందించాలి. ఎల్వోసీ కూడా నిమ్స్కే ఎక్కువగా ఇస్తున్నాం. నిమ్స్‌లో పనిచేయడం కొంత కష్టంగా ఉంటుంది. నిమ్స్‌లో విశ్వాసం, విశ్వసనీయతతో పనిచేయాలి. 3,630 పడకల ఆస్పత్రిగా రూపుదిద్దుకుంటుంది. బాగా పనిచేసేవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సంస్థ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలి.’ అని మంత్రి హరీశ్ రావు సూచించారు.
అంతకుముందు ఎర్రమంజిల్‌లో 200 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. నిమ్స్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ను 54కోట్ల రూపాయల ఖర్చుతో 4 అంతస్తుల్లో నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు.