రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సీఎం… ఎన్నికల కోడ్ ఉన్నందునే రుణమాఫీ చేయలేకపోయామని తెలిపారు. వచ్చేసారి వడ్లకు 500 బోనస్ తప్పకుండా ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ఆగష్టు15వ తేదీన రుణమాఫీ అంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన పోరాటానికి భయపడే సీఎం ప్రకటన చేశారని అన్నారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేయనందుకు ప్రజలకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎకరానికి 15వేలు, వ్యవసాయ కూలీలకు 12వేలు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మహిళలకు నెలకు 2 వేల500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 4వేలకు పెంచుతామన్న పింఛన్ల సంగతి ఏమైందని అడిగారు. ఇచ్చిన హామీలను అమలు చేసే సిద్ధ శుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓడిపోతామని భయంతోనే మళ్లీ కొత్తగా హామీలు ఇస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు.