ఐటీ సేవల విస్తరణకు పటాన్‌చెరు కేంద్రం కాబోతోందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యం అని స్పష్టం చేశారు. కాలం చెల్లిన నాయకులకు పట్టం కట్టినా బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఫ్రీడం పార్కు, గ్రేటర్ డివిజన్ కార్యాలయం, డీసీసీబీ బ్యాంకు కార్యాలయం, ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. దక్షిణ భారత్‌పై బీజేపీకి చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షల మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు పక్కా అని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడితే.. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పటాన్‌చెరుకు మెట్రో ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.