దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇష్టానుసారంగా చెట్లను నరికి సమర్ధించుకోవడం ఏంటని, చెట్ల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఓ ప్రణాళికతో రావాలని, పర్యావరణ పరిరక్షణలో తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదేవిధంగా భూముల్లో పర్యవరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు..? ఎంతకాలంలో ఆ పనులు పూర్తి చేస్తారు, జంతువులను ఎలా సంరక్షిస్తారు వంటి అంశాలపై ప్రణాళికను 4 వారాల్లోగా ఫైల్ చేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్టేటస్ కో కొనసాగుతుందని, తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది.
సుప్రీం వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సుప్రీంకోర్టుపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. కోర్ట్ ఆదేశాల మేరకే నడుచుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఆ భూములు ప్రభుత్వానివేనని ధర్మాసనం తెలిపిందని.. ప్రతిపక్షాలు నకిలీ వీడియోలతో అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారని మండిపడ్డారు.