వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం రోజున విద్యుత్ సరఫరాకు సుమారు ఐదు గంటల పాటు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో సమీక్షించారు. ఈ ఘటనలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురికావడానికి బాధ్యులను గుర్తించి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు వైద్య, ఆరోగ్యసేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జనరేటర్‌ల ద్వారా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రానున్న వర్షాకాలంలో వరంగల్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లను ఇంజినీర్లతో తనిఖీ చేయించాలని, లేని చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో.. ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎంజీఎం సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.