రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. గతేడాది ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుతం దాదాపు అన్ని జిల్లాల్లో 3.5 డిగ్రీలపైనే అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతోనే ప్రస్తుతం వాతావరణంలో వేడి అమాంతంగా పెరిగిందని పేర్కొంటున్నారు. ఈ నెలలో మున్ముందు మరింత తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఇవాళ తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతారవణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మధ్యాహ్నం తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని, ఆ సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తాయని, వృద్ధులు, బాలింతలు, పిల్లలతోపాటు పక్షులపైనా ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఈ అధిక ఉష్ణోగ్రతలతో ఏర్పడే అల్పపీడనం కారణంగా.. సోమవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన వాతావరణ శాఖ తెలిపింది.