తెలంగాణలో మళ్లీ వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా జంట నగరాలైన హైదరాబాద్-సికింద్రాబాద్ లను వణికిస్తున్నాడు. రెండ్రోజులు కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత.. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. దాదాపు గంటన్నర పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాన నగరాన్ని బెంబేలెత్తించింది. ప్రస్తుతం ఏకధాటి వాన కురుస్తూ నగరవాసులను తిప్పలు పెడుతోంది.
ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు నేపథ్యంలో సురక్షితంగా ఉండేలా రాచకొండ పోలీసులు ప్రజలకు కొన్ని జాగ్రత్తలను సూచించారు.
- నగరంలో నీటి ప్రవాహంతో ఉన్న కాల్వలు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
- విద్యుత్ స్తంభాలు, పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
- చెట్ల కింద, పాత గోడల పక్కన ఉండొద్దని మరీ మరీ చెప్పారు.
- కొత్త దారిలో పోకుండా ఎప్పుడూ వెళ్లే దారిని మాత్రమే ఉపయోగించండని చెప్పారు. ఎందుకంటే.. కొత్తదారిలో ఎక్కడ ఏ గుంత.. ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియదు కాబట్టి తెలిసిన దారిలోనే వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
- పిల్లలను ఆడుకొనేందుకు వర్షపు నీటిలోకి గానీ, వరద నీటి సమీపంలోకి గానీ పంపొద్దని.. ఎట్టి పరిస్థితుల్లో మ్యాన్ హోల్స్ దరిదాపుల్లోకి పిల్లలను వెళ్లనివ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు.
- ఇంట్లో విద్యుత్ పరికరాల వద్దకు, బయట విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వైపు చిన్నారులు వెళ్లకుండా తగిన జాగ్రత్త తీసుకోండని.. అత్యవసర సమయాల్లో 100కి డయల్ చేయండని చెప్పారు.