తెలంగాణలో మధ్యాహ్నం అంతా ఎండ వేడిమి, ఉక్కపోతతో తల్లడిల్లిన ప్రజలకు సాయంత్రం చల్లగాలలు కాస్త ఊరట కలిగించాయి. అయితే కొన్ని జిల్లాల్లో ఇవాళ సాయంత్రం కాస్త చల్లబడింది కానీ మరికొన్ని జిల్లాల్లో మాత్రం అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. తాజాగా వికారాబాద్ జిల్లాలో వడగండ్ల వాన విలయం సృష్టించింది.
ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మోమిన్‌పేట, నవాబుపేట మండలాల్లో వడగండ్ల వాన కడగండ్లు మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వానతో మామిడి, నిమ్మ వంటి పంటలు నేలరాలాయి. నవపేట మండలం చిట్టిగిద్ద గ్రామ సమీపంలో ఈదురు గాలులకు భారీ వృక్షం నేలకొరగడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కురిసిన వడగండ్ల వానకు రైతులు అల్లాడిపోయారు. సాయంత్రం వేళ ఉరుములు, మెరుపులతో మొదలైన వాన గంటసేపు కురవడంతో జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మునిపల్లి మండలంలోని బుదేరా, మేళాసంఘం గ్రామాల్లో, ఝరాసంగం మండలంలో వడగండ్ల వాన దంచి కొట్టింది.