సంక్రాంతి సందడి షురూ అయింది. ఇవాళ్టి నుంచి విద్యాసంస్థలకు సెలవు కావడంతో హైదరాబాద్ మహానగర వాసులంతా సొంతూళ్లకు పయనమయ్యారు. ఆఫీసులకు సెలవులు పెట్టి సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు ఊళ్లకు బయల్దేరారు. ఇలా భాగ్యనగరమంతా ఊరెళ్తుండటంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. మరోవైపు టోల్ప్లాజాల వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా నగరం నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోనుంది.
రాజధాని నుంచి ప్రజలు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో భారీ సంఖ్యలో తరలి వెళ్తుండటంతో రాష్ట్రంలోని పంతంగి, కొర్లపహాడ్, ఏపీలోని చిలకల్లు, కీసర టోల్ ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. వాహనదారులు గంటల సేపు వేచి చూడాల్సి వస్తోంది. ఫాస్టాగ్ విధానం అమల్లో ఉన్నా కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోకపోవడం.. ఇంకొందరు అసలు ఫాస్టాగ్ తీసుకోకపోవడంతో టోల్ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ప్రతి ఏడాది లాగే ఈ సంక్రాంతికీ వాహనాల రాకపోకలకు అంతరాయం తప్పడం లేదంటూ వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు.