పురాతన భవనాలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతపై నేడు ఉన్నతస్థాయి సమీక్ష

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం దృష్ట్యా కూల్చివేతలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో పురాతన భవనాలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది. అందుకే హైదరాబాద్‌లో పురాతన భవనాలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బీఆర్కే భవనంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీతోపాటు వివిధశాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెల్లార్లను, భవనాల వివరాలు తెలుసుకోవాలని అధికారులకు రెండురోజుల క్రితం హోంమంత్రి ఆదేశించారు. సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో సెల్లార్లను నిర్మించి నిబంధనలకు విరుద్ధంగా సొంత వ్యాపారాలను చేస్తుండంతో అగ్గి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని అధికారులు ఇప్పటికే… హోంమంత్రి మహమూద్ అలీకి వివరించారు. ఈ నేపథ్యంలో.. ఇవాళ్టి భేటీలో మంత్రుల నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.