రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం చివరికి విషాదంగా ముగిసింది. ఆత్మహత్యకు యత్నించిన రవీందర్ మృతి చెందాడు. అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
సకాలంలో జీతం అందక బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందన్న మనస్తాపంతో అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని రవీందర్ నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన ఈనెల 5వ తేదీన షాయినాయత్‌గంజ్ ఠాణా పరిధిలో మంగళవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే జీతం గురించి అడగడానికి వెళ్తే అధికారులు కించపరిచారని బాధతో రవీందర్ ఇంటికి వచ్చాడని ఆయన భార్య తెలిపింది. ఆ బాధలోనే తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది.
పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న రవీందర్‌ను మొదట ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వెంటిలేటర్ ద్వారా వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా.. పరిస్థితి విషమించి హోంగార్డు రవీందర్ మృతిచెందాడు.