రెండు, మూడు నెలలుగా జీతం రావడం లేదని.. ఇంటి ఖర్చులు, బ్యాంకు ఈఎంఐలు చెల్లింపు ఆలస్యమవుతోందని మనస్తాపం చెందిన ఓ హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేశారు. అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఈ ఘటన షాయినాయత్‌గంజ్ ఠాణా పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన ఎం.రవీందర్(38) చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ ఠాణాలో హోంగార్డుగా పని చేస్తున్నారు. బ్యాంకు రుణానికి సంబంధించిన ఈఎంఐ ప్రతి నెల 5వ తేదీన చెల్లించేలా పెట్టుకున్నారు. రెండు, మూడు నెలల నుంచి జీతం పడకపోవడంతో కారణం తెలుసుకోవడానికి గోషామహల్‌లోని హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి ఉద్యోగులు చెక్కులు బ్యాంకులకు పంపించామని.. ఒకట్రెండు రోజుల్లో జమవుతాయని చెప్పారు.
కార్యాలయం బయటకు వెళ్లిన ఆయన తన వెంట బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నారు. శరీరమంతా మంటలు వ్యాపించగా.. గట్టిగా కేకలు వేస్తూ కార్యాలయంలోకి ప్రవేశించారు. ఈ హఠాత్పరిణామంతో ఉలిక్కిపడ్డ సిబ్బంది వెంటనే తేరుకొని మంటలార్పారు. అప్పటికే 50శాతం శరీరంపై కాలిన గాయాలయ్యాయి.