కొత్త ఏడాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర తదితర ఆలయాలతో పాటు ఏపీలోని తిరుమల, శ్రీశైలం, సింహాచలానికి భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచీ తరలివచ్చారు. తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు.
మరోవైపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల భారీ సంఖ్యలో పోటెత్తారు. న్యూ ఇయర్ కావడం అది కూడా సోమవారం రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మేడారం జాతరకు ముందుగా భక్తులు రాజన్నను దర్శించుకోవడానికి వస్తుండడంతో గర్భాలయంలో ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు.
ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి పోటెత్తిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని విశేష పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరం కలిసి రావాలంటూ వేడుకున్నారు. ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర ఆలయాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి.