నూతన సంవత్సర వేడుకల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే న్యూ ఇయర్ వేడుకల వేళ ఆదివారం రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో పోలీసులు ఎంతగా హెచ్చరించినా కొంత మంది మందుబాబులు వారి హెచ్చరికలు పట్టించుకోలేదు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డారు. అలా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా మందుబాబులు దొరికిపోయారు. ఈ తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలు సహా 1239 మందిపై కేసుల నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సోదాల్లో 938 ద్విచక్ర వాహనాలు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. తనిఖీల్లో పోలీసులతో పలుచోట్ల వాహనదారులు వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు.