శ్రావణ సోమవారం స్పెషల్.. వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

-

శ్రావణమాసం సందర్భం అందులోనూ సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సుప్రసిద్ధ దేవాలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. కుటుంబంతో సహా స్వామి దర్శనానికి బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో కోడెలను కట్టేసి రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆలయ నిర్వాహకులు ఆర్జిత అన్న పూజల సేవలు రద్దు చేశారు. తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వ ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

మరోవైపు ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే దర్శనానికి బారులు తీరారు. చిరుజల్లులు కురుస్తున్నా వానలోనే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక యాదాద్రిలో ఈనెల 14 నుంచి 16 వరకు ఆలయ పవిత్రోత్సవాలు జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పాతగుట్ట ఆలయంలోనూ వార్షిక పవిత్రోత్సవాలు, ఈనెల 26, 27 తేదీల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 15, 16న నిత్య, శాశ్వత తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం, హోమాలు రద్దు చేసినట్లు వెల్లడించారు. తిరిగి ఈనెల 17న యథావిధిగా స్వామివారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news