సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులంతా భాగ్యనగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. బస్సులు, కార్లు, రైళ్లు ఇలా ఏది దొరికితే అధి పట్టుకుని నగరానికి చేరుకుంటున్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక ఆపసోపాలు పడిన నగరం చేరుకున్న ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగిరావడంతో మెట్రోలో రద్దీ భారీగా పెరిగింది. ప్రధానంగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వైపు రైళ్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. సాధారణంగా ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. కానీ, మంగళవారం 5.30 నుంచే రాకపోకలు మొదలయ్యాయి. రద్దీ దృష్ట్యా మరిన్ని ట్రిప్పులు నడిపే అవకాశమున్నట్లు సమాచారం. మెట్రోలు నిలబడటానికి కూడా స్థలం లేకుండా జనం కిక్కిరిసిపోయారు.