టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలుగు రాష్ట్రాల్లోని ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రాష్ట్రాల ప్రజలు ఆందోళనలకు దిగారు. ఓవైపు ఏపీలో నిరసన జ్వాలలు ఉద్రిక్తంగా మారుతుంటే.. మరోవైపు తెలంగాణలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే చంద్రబాబుకు మద్దతిస్తూ హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులు గత మూడ్రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇవాళ బాబుకు మద్దతుగా నగరంలోని ఐటీ ఉద్యోగులు కారు ర్యాలీ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి కారు ర్యాలీ జరగనుంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీ జరపనున్నారు. విడతల వారీగా కారు ర్యాలీ నిర్వహణకు ఐటీ ఉద్యోగులు నిర్ణయించారు. అయితే ఉద్యోగుల ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి లభించలేదు.
మరోవైపు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రగతినగర్‌లో అభిమానులు ర్యాలీ నిర్వహించారు. మిథిలానగర్ నుంచి అంబీర్ చెరువు వరకు ర్యాలీగా వెళ్లారు. సైకో పోవాలి సైకిల్ రావాలి, జాబ్ రావాలంటే బాబు రావాలంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో నందమూరి చైతన్యకృష్ణ కూడా పాల్గొన్నారు.