కూతురిపై అత్యాచారం.. తండ్రికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన ఓ తండ్రికి హైదరాబాద్​లోని నాంపల్లి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దాంతో పాటు 5వేల జరిమానా విధించింది.  రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై నాంపల్లి కోర్టు గురువారం రోజున తీర్పు వెలువరించింది. ఇంతకీ రెండేళ్ల క్రితం ఏం జరిగిందంటే..?

హైదరాబాద్‌లోని హబీబ్ నగర్‌కి చెందిన హఫీజ్‌కు ఆరుగురి సంతానం. అందులో నలుగురు కుమారైలు. హఫీజ్ ఏం పని చేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. ఆయన భార్య భిక్షాటన చేస్తూ ఇళ్లు గడిపేది. తన పిల్లలను పోషించుకునేది. ఈ క్రమంలోనే 2021 నవంబర్ ౩౦వ తేదీన భార్య భిక్షాటన మేరకు బయటికి వెళ్లింది. మద్యం మత్తులో ఉన్న హఫీజ్ తన పదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కేకలు విన్న స్థానికులు బాలికను కాపాడారు.

విషయం తెలుసుకున్న హఫీజ్ భార్య హుటాహుటిన ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హఫీజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన నాంపల్లి కోర్టు హఫీజ్ ను దోషిగా తేల్చింది. బాధిత బాలికకు 5లక్షల ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది