తనను చంపేస్తామంటూ మెసేజ్లు, బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ద్వేషం పెంచుకుందని ఆరోపించారు. హైదరాబాద్ దారుస్సలాంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. ముస్లింలతోపాటు దళితులు, బడుగు బలహీనవర్గాల గొంతుకనై వారి సమస్యలపై నినదిస్తున్న తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
దిల్లీలోని తన అధికారిక నివాసంపై పలుమార్లు దాడులు చేశారని అసదుద్దీన్ ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్న తనపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపిన దుండగుల్లో ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని.. ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. అస్సాంలో ముస్లింల జనాభా 40 శాతం దాటిందంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి 34 శాతం మాత్రమే ఉందని ఒవైసీ తెలిపారు. కేంద్ర సర్కారుతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను అణచివేసే కార్యక్రమాన్ని పథకం ప్రకారం కొనసాగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.